ముఖ్యమంత్రి ఆదేశాలతో కదంతొక్కిన అధికార యంత్రాంగం
నివారణ చర్యలతో కోవిడ్ – 19పై యుద్ధం
జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్, టాస్క్‌ఫోర్స్‌కమిటీలు
ఆస్పత్రుల్లో మంత్రులు , కలెక్టర్లు, అధికారులు, తనిఖీలు
కోవిడ్–19ను ఎదుర్కోవడానికి వైద్యసదుపాయాల కల్పనపై ఆరా
గ్రామ, వార్డు స్థాయి వరకూ చురుగ్గా కార్యక్రమాలు
అమరావతి:మార్చి 21 వారధి న్యూస్ ;ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రంగాం కదంతొక్కింది. గత కొన్నిరోజులగా అప్రమత్తంగానే ఉంటూ చర్యలు చేపట్టిన ప్రభుత్వం, మరింత వేగంగా ముందుకు కదిలింది. కోవిడ్ –19 (కరోనా వైరస్) నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టింది.
ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులు వైరస్ నివారణపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామస్థాయి వరకూ కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధం చేశారు. ప్రతి ఇంటికీ సర్వే చేయడం, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో పెట్టడం, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించడం, విదేశాలనుంచి వచ్చిన వారిపై పర్యవేక్షణ, రోజూ వారి ఆరోగ్య వివరాలను నమోదు, వివరాల ప్రకారం వైద్యాధికారులు ఇచ్చిన సూచనలను అమలు చేయడం, అవగాహన కలిగించేలా ప్రచారం నిర్వహించడం అనే కోణాల్లో గ్రామస్థాయి వరకూ యంత్రాంగం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా యాభై ఇళ్లకో వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఇంటినీ సర్వే చేయడం, జల్లెపడపట్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఒకవేళ ఉంటే వారిని గుర్తించడంలో, వారికి వైద్య సూచనలు అందించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి కోలుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన ఉన్న ఇంటికి 3 కి.మీ పరిధిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. 335 బృందాలతో 25,950 ఇళ్లరు సర్వే చేశారు. కరోనా లక్షణాలతో ఎవ్వరూ లేరని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ఆ ప్రాంతంపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తి పర్యవేక్షణ ఉంచింది.నెల్లూరులో కరోనా పాజిటివ్‌గా తేలినవ్యక్తి... పూర్తిగా కోలుకున్నాడు. శాంపిల్స్ పంపించామని, పరీక్ష పలితాలు రాగానే ఇంటికి పంపిస్తామని అధికారులు ప్రకటించారు. ఒంగోలులో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్‌లు అధికారులతో సమీక్షనిర్వహించారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు. రేపటి జనతా కర్ఫ్యూ పాటించడంపైనా కలెక్టర్లు అన్ని రకాల సంస్థలతో సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.