విశాఖపట్నం,మార్చి,19: కోవిడ్-19 వారధి న్యూస్ (కరోనా)ను ఎదుర్కొనేందుకు విశాఖలో 5 వేలు క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులలో వసతులు బాగోలేదనే మాట వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. విమ్స్, మెంటల్, ఇ.ఎన్.టి. ఆసుపత్రుల్లో పూర్తిగా క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఎన్.ఆర్.ఐ., గీతం, గాయిత్రి కళాశాలల్లో కూడా క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసోలేషన్, క్వారంటైన్ ఆసుపత్రులకు మెడికల్ కళాశాలల నుండి పి.జి. విద్యార్థులను పంపాలని ఎ.ఎం.సి. ప్రిన్సిపల్ సుధాకర్ ను ఆదేశించారు. శిక్షణ పొందుతున్న స్టాఫ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఐసోలేషన్ వార్డుల్లో బెడ్స్, మందులకు కొరత ఉండరాదని తెలిపారు. ఛాతీ ఆసుపత్రిలోని పేషెంట్లను కె.జి.హెచ్.కు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆంబులెన్స్ లు ఆసుపత్రులలో అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఆంబులెన్స్ లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కోవిడ్-19 పై నగరంలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని జి.వి.ఎం.సి. ముఖ్య వైద్యాధికారి శాస్ర్తిని ఆయన ఆదేశించారు. బల్క్ ఎస్.ఎం.ఎస్., సిటీ కేబుల్ లో స్క్రోలింగ్ కంటిన్యూగా రావాలని, సోషల్ మీడియా, ట్విట్టర్, ఎఫ్.ఎం.లలో రావాలన్నారు. కోవిడ్-19 పై విడుదల చేసిన బ్రోచర్లను నగరంలో అందరికి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అవగాహన పరచాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎల్. శివ శంకర్, ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి శిక్షణ సంయుక్త సంచాలకులు డా. రాజేంద్ర ప్రసాద్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తిరుపతిరావు, కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. అర్జున్, విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్, ఇ.ఎన్.టి. ఛాతీ, మెంటల్ ఆసుపత్రుల పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.