ఒంగోలులో వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉంది: మంత్రి ఆళ్ల నాని
అమరావతి:మార్చి 21 (వారధి న్యూస్) ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు.
ఒంగోలులో ఒక కేసు నమోదైన తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మరోసారి బాధితుని రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్లు మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించినట్లు నాని పేర్కొన్నారు. అందరినీ ఐసోలేషన్ వార్డుల్లో, హౌస్ క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆళ్ల నాని తెలిపారు.