ఎస్‌ఈసీ బాధ్యతతో పనిచేయాలి: మంత్రి బుగ్గన
హైదరాబాద్:మార్చి 21 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ చర్చించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖకు లేఖరాయడమేంటని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని సీఎం హెచ్చరించినట్లు ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు.. ఆయన వద్ద ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. ఇలాంటి లేఖలు ఎన్నికల కమిషనర్ రాయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా గురించి తెలుసు కనుకే ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. కరోనా వల్ల వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఆరు వారాలపాటు ఎందుకు ఉంచారు?. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కోడ్ అడ్డు రాదా? కరోనాపై సీఎస్, వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారా?. స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఎన్నికలు ఆపేందుకు తోమర్ కేసును ఎందుకు వాడుతున్నారు. స్థానిక ఎన్నికలు పెట్టేముందు ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్‌ఈసీ బాధ్యతగా పనిచేయాలి. ఎస్‌ఈసీ సుప్రీంకోర్టులో కేవియట్ ఎందుకు దాఖలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలపై నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీపై చంద్రబాబు ఎలా మాట్లాడారు? డోన్ నియోజకవర్గం గురించి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి బుగ్గన అన్నారు.