ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు
అమరావతి:ఏప్రిల్ 08 వారధి న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 329కి చేరింది. ఇవాళ కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా కొవిడ్ లక్షణాలతో ఉన్న 5వేల మందిని గుర్తించారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని భావిస్తున్నారు. ‘‘3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. రాబోయేరోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తాం. ప్రైవేటుల్యాబ్‌లనూ సంప్రదిస్తున్నాం. టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్ చెప్పింది. 240 ట్రూనాట్ సెంటర్లున్నాయి. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్-95 మాస్క్‌లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్‌లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచాం’’ అని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు