కంటైన్ మెంట్ జోన్ లో ప్రజలు ఇల్లు దాటావొద్దు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు
విశాఖపట్నం,వారధి న్యూస్ ఏప్రిల్, 11: కంటైన్ మెంట్ జోన్ లో ప్రజలు ఇల్లు దాటావొద్దని కరోనాని తరిమి కొట్టాలంటే ఇంట్లో ఉండడమే సరియన నిర్ణయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.శనివారం కంటైన్ మెంట్ జోన్ అక్కయ్యపాలెం లో ఆయన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ లతో కలసి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 7 కంటైన్ మెంట్ జోన్ లలో 7.60 లక్షల జనాభా ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొబైల్ బజార్లు ద్వారా వారికి కావలసిన వస్తువులు వెలుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.రేపటి నుండి వాలంటీర్ల ద్వారా కూడా అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.24*7 గంటలు పోలీసులు అప్రమత్తంగా ఉంటారని, ప్రజలకు నిత్యవసర సరకులు కోసం బయటకు నిర్ణీత సమయాలలో పంపుతారని తెలిపారు.లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు.కోవిడ్-19 నివారణలో క్షేత్ర స్థాయిలో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు బాగా పని చేస్తున్నారని, కేసులు పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసున్నట్లు ఆయన అభినందించారు.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.రేషన్ కార్డులు లేని వారికి 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు.కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడమైనదన్నారు.కంటైన్ మెంట్ జోన్ లో గర్భిణీలు ఎంత మంది ఉన్నారో సర్వే చేసి వారికి వైద్య సేవలు అందించే విధంగా తగిన తీసుకోవాలని జోనల్ కమీషనర్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ 7 కంటైన్ మెంట్ జోన్ లు ఉన్నాయని, 3 కిలో మీటర్ల వరకు కంటైన్ మెంట్ జోన్ గా గుర్తించి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.కంటైన్ మెంట్ జోన్ లో ప్రతీ వంద మంది కి ఒక టీం ఉన్నదని, వీరు సర్వే చేసి సత్వరమే రిపోర్టులు అందిస్తున్నారని పేర్కొన్నారు.ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు బాగా పని చేస్తున్నాయని చెప్పారు.ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆర్డీఓ పెంచల కిషోర్, జివిఎంసి అదనపు కమీషనర్ సన్యాసినాయుడు, జోనల్ కమీజోనల్ కమీషనర్, తహసీల్దార్ జ్ఞాన వేణి తదితరులు పాల్గొన్నారు