ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్ పదవీ విరమణ
6నెలలు సెలవ్ తరువాత పదవీ విరమణ
అమరావతి ఏప్రిల్ 30 వారధి న్యూస్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ ఏప్రిల్ 30- గురువారం నాడు పదవీ విరమణ చేశారు. నవంబర్ 6వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి మానవ వనరుల అభివృద్ధికి బదిలీ అయిన దగ్గర నుండి ఆరు నెలల పాటు సెలవుపై ఉన్నారు. పదవీ విరమణ చేయాల్సిన దృష్ట్యా ఎల్.వి. సుబ్రహ్మణ్యం నిన్న జిఎడి కి రిపోర్ట్ చేసి గురువారం నాడు రిటైర్ అయ్యారు. 1983 బ్యాచ్ కి చెందిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం అఖిల భారత సర్వీసులో మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంకు సాధించారు. నల్గొండ జిల్లాకు శిక్షణకు వెళ్లిన మొదటి అధికారి సుబ్రహ్మణ్యం. 1986లో వరంగల్ జిల్లా ములుగు సబ్-కలెక్టర్ గా పని చేసిన సందర్భంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా భక్తుల మన్ననలు పొందారు. పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఎల్.వి.సుబ్రహ్మణ్యం మూడేళ్ల పాటు పని చేసి గిరిజనుల మౌలిక అంశాలపై దృష్టి పెట్టి సృజనాత్మకమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన భూములకు సాగునీటి సౌకర్యాలు, పోడు భూములను ఉద్యానవనాలుగా మార్చి అందరి ప్రశంసలు పొందారు. గిరిజన విద్యాభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలు చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొద్ది రోజులు పనిచేసాక, 1990లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయ్యారు. ఈ సందర్బంగా గ్రామీణ, గిరిజన అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.మధ్యలో ఒక సంవత్సరం పాటు బ్రిటన్ లో ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి డిగ్రీ కోసం యూనివర్సిటీ అఫ్ బ్రాడ్ఫోర్డ్ లో చేరారు. మళ్ళీ భారత్ కి వచ్చాక రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండిగా పని చేసిన సమయంలో భారీ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో కూడుకున్న సాంకేతికతను అమలు చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. 1987లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ వైస్ చైర్మన్, ఎండి గా కంప్యూటరీకరణ ద్వారా వినియోగదారులకు మరింత చేరువలో సేవలు ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఏడు మున్సిపాలిటీలలో (ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిథిలో ఉన్నాయి) నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచిన తీరు ప్రజలు, నాయకుల ప్రసంసలు అందుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా ఎల్.వి.సుబ్రహ్మణ్యం హయాంలోనే చేపట్టారు.
అందరికీ కృతజ్ఞతలు:
తన 36 సంవత్సరాల 8 నెలల 3 రోజుల ఉద్యోగ కాలంలో తోటి అధికారులు, ఉద్యోగులు ఎంతో సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలని ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా అన్నారు. ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ తనకు ఎంతో మంది ప్రేరణగా నిలిచారని చెప్పారు. కాల ప్రవాహం, వేగంతో సాగిందని ఇప్పుడు అనిపిస్తోందని, ఎంతో మంది శ్రేయోభిలాషులు తన ప్రస్థానంలో చేదోడు వాదోడుగా, తన వెంట ఉన్నారని, వారందరికీ రుణపడి ఉంటానని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక అద్భుత ఆశయాన్ని నమ్ముకొని, కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ముందుకు సాగుతున్న తనను తన బాగు కోరిన ఎందరో ముందుకు నడిపించారని, తన అనుభవం కూడా ఎంతో నేర్పిందని అయన చెప్పారు. కర్మణ్యే వాదికా రస్తే ... వంటి గీతా సారాలు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తు తన పయనంలో మరింత నైతిక స్థైర్యాన్ని అందించాయని ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రభుత్వంలో తనకు సహకరించిన నేతలు, అధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు.