పాత్రికేయులకూ చేయూతనివ్వండి

పాత్రికేయులకూ చేయూతనివ్వండి
రూ10వేల ఆర్ధిక సాయానికి వినతి----
ముఖ్యమంత్రికి APWJF లేఖ
---------
 విజయవాడ ఏప్రిల్ 08 వారధి న్యూస్  కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పాత్రికేయులకూ ప్రభుత్వం చేయూత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఏపీడబ్లు్యజేఎఫ్‌), నేషనల్‌ ఎలియెన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స  (ఎన్‌ఏజే) కోరాయి. లాక్‌డౌన్‌ సమయంలోనూ జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అనుసంధాన కర్తలుగా అద్వితీయ పాత్ర పోషిస్తున్నారని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నాయి. పాత్రికేయులు ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో వార్తలను సేకరించి పంపుతున్నారో ఓ జర్నలిస్టు శ్రేయోభిలాషిగా, ముఖ్యమంత్రిగా తమకు తెలియనిది కాదని సంఘం నేతలు జి.ఆంజనేయులు, ఎన్‌.వెంకట్రావ్, ఎన్‌.కొండయ్య, కె.మునిరాజు, శాంతి తదితరులు ఆ లేఖలో వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో విలేఖరులకు వచ్చే లైన్‌ అకౌంట్‌ మొత్తాలను కూడా పలు యాజమాన్యాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో జర్నలిస్టులు ఓవైపు పోలీసుల నుంచి మరోవైపు సంఘ వ్యతిరేక శక్తుల నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వార్తలు సేకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ ఉన్న వారు, లేనివారు అందరూ కలిసి సుమారు సుమారు 24 వేల మంది వరకు ఉంటారని, వారందరికీ కనీసం రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్ధిక పధకాలను సీఎం దృష్టి కి తీసుకువచ్చారు. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన పాత్రికేయులకు పెన్షన్‌ సౌకర్యాన్ని ఇప్పటికైనా ఆలోచించాలని విన్నవించారు.