వలస కార్మికుల వివరాలను తెలపండి - రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు
విశాఖపట్నం, మే 1: రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న ఇతర ప్రాంత కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన కార్మికులు, కూలీల వివరాలను తెలియజేయాలని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎమ్.టి. కృష్ణబాబు జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని గుర్తించి, వీలైనంత త్వరలో వారిని బస్సులలో లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే రైళ్లలో వారి రాష్ట్రాలకు తరలించడం మన వారిని తీసుకు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా చేపట్టేందుకు వారి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక, వ్యవసాయ కార్మికులు మన జిల్లాలలో పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారి వివరాలను సేకరించి పంపినట్లయితే సంబంధిత రాష్ట్రాలకు తెలియజేస్తామన్నారు. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నది కూడా తెలియజేయాలన్నారు. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టరు ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ పై రాష్ట్రాలకు చెందిన కార్మికులు, వ్యవసాయ కార్మికులను, వలస కూలీలను గుర్తించామని వారికి నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతున్నదని, పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పై రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను కూడా గుర్తిస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్నో విశాఖపట్నం నుండి డిసిపి నరసింహ మూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్, ఎస్ డి సి అనిత, జనరల్ మేనేజర్ పరిశ్రమల శాఖ రామలింగ రాజు తదితరులు పాల్గొన్నారు.